బంధిత కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం
- చట్ట అమలులో రాజీలేదు
- కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
- బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు
- వలస, బంధిత కార్మికుల మధ్య తేడాను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశం
- క్వారీలు, ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు
- చట్ట ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ సూచనలు
విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లాలో బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి కోసం స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే వలస కార్మికులు మరియు అప్పులు, బెదిరింపులు, బలవంతం కారణంగా పనిచేసే బంధిత కార్మికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు స్పష్టంగా గుర్తించాలని సూచించారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే చట్టపరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలోని క్వారీలు, ఇటుక బట్టీలు, ఇసుక బట్టీలు, ఇతర కార్మికులు అధికంగా పనిచేసే ప్రాంతాల్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బంధిత కార్మిక వ్యవస్థకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఉల్లంఘనలు గుర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్వారీలు, ఇటుక బట్టీలు, పరిశ్రమల యాజమాన్యాలకు బంధిత కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎదురయ్యే శిక్షలు, చట్టపరమైన పరిణామాలను వివరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ మాట్లాడుతూ, బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రెవెన్యూ, కార్మిక, పోలీసు, మహిళా–శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్మూలించగలమని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
