ప్రభుత్వ ఐటీఐలో రెండో విడత వాక్-ఇన్ అడ్మిషన్లు
ఆగస్టు 15 వరకు దరఖాస్తులకు అవకాశం.. 108 ఖాళీ సీట్ల భర్తీ
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో 2026–27 విద్యాసంవత్సరానికి రెండో విడత వాక్-ఇన్ (తక్షణ) అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎల్. జూమ్లా నాయక్ తెలిపారు.
ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ఎన్‌సీవీటీ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న 108 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ (ఎఫ్‌ఈఎం), సీఎన్‌సీ మిషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్) ట్రేడ్లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 5 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులతో పాటు ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు కూడా నమోదు చేసుకుని నేరుగా వాక్-ఇన్ అడ్మిషన్‌కు హాజరుకావచ్చని సూచించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
అభ్యర్థులు 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న వివరాల ప్రకారమే పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మతేదీ నమోదు చేయాలని సూచించారు. అలాగే ఆధార్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
