బంధువుల ఇంటి నుంచి వస్తుండగా..
- దేవక్కపేట్ శివారులో విషాదం..
భీమ్‌గల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవక్కపేట్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గుగులోతు ప్రమోద్, గుగులోతు నరేందర్ తో కలిసి ద్విచక్రవాహనంపై దేవక్కపేట్‌లోని బంధువుల ఇంటికి వచ్చి.. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రోడ్డుపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వారి బైక్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రమోద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నరేందర్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీని నిర్లక్ష్యంగా నిలిపిన గంధం రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా భీమ్‌గల్ ఎస్సై సీహెచ్. తిరుపతి మాట్లాడుతూ.. రహదారులపై ట్రాక్టర్లు, ట్రాలీలు లేదా ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా పార్క్ చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రివేళ వాహనాలను నిలిపివేయాల్సి వస్తే తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు లేదా ఇతర భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
