రాజమహేంద్రవరం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
34వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం..
రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు వివరణ
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి – సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నగరంలోని 34వ డివిజన్లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి స్థానికులను కలుసుకుని ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తోందన్నారు. పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, తాగునీటి సౌకర్యాల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం ద్వారా వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
