సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

బెజ్జంకి (ఆంధ్రప్రభ): సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా “సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ వైపు” నినాదంతో బుధవారం బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాలలో ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి, మానవహారంగా నిలబడి సైబర్ నేరాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.

ఆ తర్వాత నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి పేరుతో మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఎస్‌ఐ తిరుపతి మాట్లాడుతూ యువత సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచిత లింకులు, యాప్‌లకు దూరంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నవత, చంద్రమోహన్, పోలీసు సిబ్బంది, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఫ్యూలా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.