యూనియన్ బ్యాంకులో షార్ట్‌సర్క్యూట్.. మంటలు

నాలుగు ఏసీలు దగ్ధం.. క్యాష్ కౌంటర్ సీలింగ్‌కు స్వల్ప నష్టం

మధిర (ఆంధ్రప్రభ): ఖమ్మం జిల్లా మధిరలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని బ్యాంకు సిబ్బంది వెళ్లిపోయిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బ్యాంకు నుంచి కాలిన వాసన రావడంతో స్థానికులు అప్రమత్తమై బ్యాంకు సిబ్బందితో పాటు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, బ్యాంకు సిబ్బంది తాళాలు తెరవడంతో లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో నాలుగు ఎయిర్ కండీషనర్లు పూర్తిగా దగ్ధం కాగా, క్యాష్ కౌంటర్ సీలింగ్ స్వల్పంగా దెబ్బతింది. బ్యాంకులోని నగదు, కీలక ఫైళ్లకు ఎలాంటి నష్టం జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాఖ మేనేజర్ నవీన్ తెలిపారు.