ప్రభుత్వ పర్యాటక ఆస్తులు పరిరక్షిస్తా..

  • దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించం
  • ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ
  • గోపవరం ఆస్తిలో అక్రమ వినియోగంపై ఆగ్రహం.. చట్టపరమైన చర్యలకు ఆదేశం
  • కర్నూలు హరిత హోటల్ సేవలపై ప్రశంసలు.. ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సానుకూల హామీ
  • పర్యాటక ఆస్తుల పరిరక్షణ, సమర్థ వినియోగమే ప్రభుత్వ లక్ష్యం

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వానికి చెందిన పర్యాటక ఆస్తుల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం వాటిని సమర్థవంతంగా వినియోగించేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ డా. నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా గోపవరం ఏపీటీడీసీ పర్యాటక ఆస్తి, అనంతరం కర్నూలు హరిత హోటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గోపవరం పర్యాటక ఆస్తిలో పర్యాటక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు ప్రభుత్వ ఆస్తిని అనధికారికంగా నివాస అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించి నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్తిని తిరిగి పర్యాటక వినియోగంలోకి తీసుకురావడానికి తక్షణ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

అనంతరం కర్నూలు హరిత హోటల్‌లో వసతి, పరిశుభ్రత, అతిథి సేవలను పరిశీలించిన ఆయన సిబ్బంది పనితీరును అభినందించారు. ఆక్యుపెన్సీ రేషియో 85 శాతానికి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, ఆదాయ వృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఉద్యోగులతో సమావేశమైన సందర్భంగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని, గ్రాట్యుటీ బకాయిలపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే అహోబిలం, మహానంది హరిత యూనిట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.