అక్రమ రవాణా.. వెట్టిచాకిరిపై ఉక్కుపాదం

  • పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ..
  • బాధితుల గుర్తింపు, దర్యాప్తు, సాక్ష్యాల సేకరణపై అవగాహన

నర్సరావుపేట, (క్రైమ్) ఆంధ్రప్రభ: మానవ అక్రమ రవాణా (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్), వెట్టిచాకిరి (బాండెడ్ లేబర్) కేసులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పల్నాడు జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

మానవ అక్రమ రవాణాను అరికట్టి ప్రతి మనిషి స్వేచ్ఛను కాపాడాలనే లక్ష్యంతో పోలీసు అధికారులకు పలు కీలక అంశాలపై శిక్షణ అందించారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి బాధితులను గుర్తించే విధానం, బాధితులను రక్షించడం, కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టడం, నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించడం, నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తదితర అంశాలను వివరించారు.
చట్టాలపై అవగాహన శిక్షణలో భాగంగా మానవ అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు, వెట్టిచాకిరి తదితర అంశాలకు సంబంధించిన వివిధ చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)-2023, బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) యాక్ట్-1976, పోక్సో యాక్ట్-2012, జువైనల్ జస్టిస్ యాక్ట్-2015, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్-1956 తదితర చట్టాల నిబంధనలు, వాటి అమలు తీరుపై వివరించారు.

మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి వంటి నేరాలకు గురయ్యే బాధితులను సకాలంలో గుర్తించి వారికి రక్షణ కల్పించడంతో పాటు, నిందితులపై చట్టపరంగా బలమైన కేసులు నమోదు చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా ఆధారాల సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని శిక్షణలో వివరించారు.

“మానవ అక్రమ రవాణాను అరికట్టుదాం.. ప్రతి మనిషి స్వేచ్ఛను కాపాడుదాం” అని అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి వంటి తీవ్రమైన నేరాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను గుర్తించిన వెంటనే వారికి అవసరమైన రక్షణ, సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్‌తో పాటు హ్యాండ్ ఆఫ్ కంపాషన్ ఎన్జీవో డైరెక్టర్ ఆనంద్ బెంజిమెన్ (చైల్డ్ లేబర్ విభాగం), జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.