మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి..
- ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌కు గ్రామస్తుల వినతి..
- ఏలూరు–మణుగూరు బస్సు సర్వీస్ ప్రారంభించాలని విజ్ఞప్తి
మండవల్లి, ఆంధ్రప్రభ : కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలానికి చెందిన ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకులంక గ్రామాలకు ఏలూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సు సౌకర్యం కల్పించాలని మూడు గ్రామాల ప్రజలు కోరారు.
ఈ మేరకు మంగళవారం ఏలూరులో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ద్వారా ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
వినతిపత్రంలో గ్రామాల ప్రజలు తమ సమస్యలను వివరించారు. ఇంగిలిపాకలంక, నందిగామలంక, పెనుమాకులంక గ్రామాల్లో అధిక సంఖ్యలో బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, చేపల పెంపకం, చేపల వేటే ప్రధాన జీవనాధారమని తెలిపారు.
ప్రతిరోజూ మత్స్యకారులు చేపల విక్రయాల కోసం ఏలూరు చేపల మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తోందని, అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వైద్య అవసరాల కోసం ప్రజలు నిత్యం ఏలూరుకు రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ బస్సు సౌకర్యం లేక ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల అధిక వ్యయం, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వర్షాకాలంలో, రాత్రి వేళల్లో, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఇంగిలిపాకలంక–నందిగామలంక–పెనుమాకులంక మీదుగా మణుగూరు వరకు నూతన రహదారి నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, ప్రస్తుతం ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులు సులభంగా నడిపే పరిస్థితులు ఉన్నాయని వివరించారు.
అందువల్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు నుంచి ఇంగిలిపాకలంక–నందిగామలంక–పెనుమాకులంక మీదుగా మణుగూరు వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును తక్షణమే ప్రారంభించి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తగిన ట్రిప్పులు ఏర్పాటు చేసి శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలని మూడు గ్రామాల ప్రజలు కోరారు. ప్రజల వినతిని అధికారులు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
