తల్లి పాలే చిన్నారులకు ఆరోగ్యం..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యకరమని ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ సూపర్ వైజర్ మాధవి అన్నారు. మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించడం అత్యంత ఆరోగ్యకరమన్నారు. తల్లిపాల వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావని, డబ్బా పాలు వల్ల పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొమ్మూరు గోపాలరావు, పత్రి లేపాక్షిరావు, పత్రి చలపతి, కో- ఆర్డినేటర్ దివ్య, అంగన్ వాడీ టీచర్లు రబ్బాని, రజిని, మహాలక్ష్మి పాల్గొన్నారు.
తల్లి పాలే పిల్లలకు బలం..
తల్లి పాలే చిన్నారులకు బలమని, పుట్టిన వెంటనే తల్లి పాలను పిల్లలకు అందించాలని నిమ్రా ఫార్మసీ విద్యార్థులు మంగళవారం అవగాహన కల్పించారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా మైలవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నం అంగన్ వాడీ టీచర్ షేక్ హసీనా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమ్రా ఫార్మసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొని తల్లిపాల ఆవశ్యకతను గర్భిణులు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ గోపి, ఫార్మసీ కళాశాల విద్యార్థులు, గర్భిణులు బాలింతలు పాల్గొన్నారు.
