పాఠశాలలకు మూలస్తంభాలు పీఈటీలే
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేయాలి: ఐటీడీఏ పీవో మంద మకరందు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : పాఠశాలల అభివృద్ధిలో, విద్యార్థుల సర్వాంగీణ వికాసంలో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) కీలక పాత్ర పోషిస్తారని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు.
మంగళవారం ఉట్నూర్ కేజీబీవీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల పీఈటీల శిక్షణా తరగతులను ఆయన సందర్శించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో వ్యాయామ ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. విద్యార్థులతో మమేకమై, వారితో ఆడుతూ పాడుతూ స్ఫూర్తినిచ్చే అవకాశం పీఈటీలకే ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ప్రతి విద్యార్థి శారీరకంగా దృఢంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పీఈటీలదేనని తెలిపారు. క్రీడా మైదానాల కొరతను సాకుగా చూపకుండా, అందుబాటులో ఉన్న వనరులతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
ప్రతి వారం ఒక అంశంపై విద్యార్థులు ఆలోచించేలా ప్రోత్సహించాలని, తద్వారా వారి విజ్ఞానం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. విద్యావ్యవస్థ మొత్తం విద్యార్థి కేంద్రంగా ఉండాలని, పీఈటీలు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి వారిలో స్ఫూర్తి నింపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏజెన్సీ డిప్యూటీ విద్యాశాఖ అధికారి గోడం చందన్, గిరిజన సంక్షేమ శాఖ పీడీలు పార్థసారథి, బుక్యా రమేష్, డీసీబీఎం మాల్యాలు, ప్రధానోపాధ్యాయుడు ఆర్. ఉత్తం, రిసోర్స్ పర్సన్లు వి. భూమన్న, ఎల్.ఎన్. శాస్త్రి, ఎంఎల్ఈ టీ. దేవురావు, పీఈటీలు పాల్గొన్నారు.
