ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా: టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) నిర్ణయించినట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

విద్యాశాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు హామీని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రీ ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించడం వల్ల పసిపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రాథమిక విద్యకు నష్టం కలిగించే జీఓ 25ను సవరించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.

నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులు, రెవెన్యూ డివిజన్లకు డిప్యూటీ ఈఓ పోస్టులు, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018కు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, టెట్‌లో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలని, ప్రత్యేక టెట్‌ను సబ్జెక్టుల వారీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలిపారు.

జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓ 190 అమలు చేయాలని, ఐదు విడతల కరువు భత్యం ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను ప్రతినెల రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు.

డిమాండ్ల సాధన కోసం దశలవారీగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, అప్పటి నుంచి పీఆర్సీ ప్రకటించే వరకు ప్రతిరోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయడం, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు.