ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం..

భూ పాస్ పుస్తకాల పంపిణీ నిలిపివేత..
ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా మండలంలోని అట్లప్రగడ గ్రామంలో మంగళవారం రైతులకు రాజముద్రతో కూడిన కొత్త భూ పాస్ పుస్తకాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 790 మంది రైతులకు భూ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ముఖ్య అతిథిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.

అయితే, ఎమ్మెల్యే కార్యక్రమానికి చేరుకున్నప్పటికీ తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన కీలక అధికారులు హాజరు కాకపోవడంతో వివాదం నెలకొంది. ప్రజాప్రతినిధికి కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా అధికారులు వ్యవహరించడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు హాజరుకాకపోవడంతో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు హాజరైన తర్వాతే పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని స్థానిక నాయకులకు సూచించారు.

అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పొలాల్లో వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులతో మాట్లాడి వారి సమస్యలు, సాగు పరిస్థితులు, కూలీల ఇబ్బందులు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు.

ప్రభుత్వం రైతుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు, అధికారుల గైర్హాజరు కారణంగా భూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.