జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రూకత దివస్ నిర్వహణ

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు.

ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలు, పెట్టుబడి ఆఫర్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే వినియోగించాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే ప్రధాన ఆయుధమని పేర్కొన్న ఎస్పీ, డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.