గూగుల్ పే, ఫోన్‌పే సేవలకు అంతరాయం..

వికారాబాద్, ఆంధ్రప్రభ: గూగుల్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపు సేవలకు సోమవారం ఉదయం కొంతసేపు అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో బ్యాంకులు పనిచేయని సమయంలో డిజిటల్ చెల్లింపులపైనే ఆధారపడే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

స్కానర్ ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రయత్నించినా లావాదేవీలు పూర్తికాకపోవడంతో వస్తువులు కొనుగోలు చేసిన పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయంగా నగదు కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత పెరిగిందని వారు తెలిపారు.

దాదాపు మూడు గంటల పాటు గూగుల్ పే, ఫోన్‌పే సేవలు సరిగా పనిచేయకపోవడంతో పలు చోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు సంబంధిత సంస్థలను కోరుతున్నారు.