బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రైతుల ఆందోళన

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: తొర్రూరు మండలం అమ్మాపురం నుంచి కంటాయపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలో తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ అమ్మాపురం, కంటాయపాలెం గ్రామాల రైతులు మంగళవారం వాగు వద్ద ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.2.95 కోట్లతో సృజన కన్స్ట్రక్షన్‌కు టెండర్ కేటాయించినప్పటికీ ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య ఆరోపించారు.

ప్రతి వర్షాకాలంలో వాగు ఉధృతి కారణంగా రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా కొత్తగా టెండర్ కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాక వెంకన్న, పాక యాకయ్య, పేరబోయిన అశోక్, పేరబోయిన యాదగిరి, పాక అమరేందర్, పాక బ్రహ్మం, గుంటుక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.