అసాధారణ తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు..
- ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం
విజయవాడ, ఆంధ్రప్రభ : గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా, ఆకస్మికంగా వచ్చే అసాధారణ తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం సూచించారు. వాసవ్య నర్సింగ్ హోమ్‌లో సోమవారం డి.రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ఆయన ‘తలనొప్పి’ అంశంపై ప్రసంగించారు. తలనొప్పులు ప్రధానంగా ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలుగా ఉంటాయని తెలిపారు. మైగ్రేన్, టెన్షన్, క్లస్టర్ తలనొప్పులు ప్రైమరీ రకానికి చెందినవని చెప్పారు. తలకు గాయం, ఇన్ఫెక్షన్లు, మెదడులో రక్తస్రావం, రక్తనాళాల్లో ఉబ్బులు, కంతులు, అధిక రక్తపోటు వంటి కారణాలతో వచ్చే తలనొప్పులను సెకండరీ తలనొప్పులుగా పేర్కొన్నారు.
ఇటువంటి వాటిని సాధారణ తలనొప్పిగా భావించి నొప్పి నివారణ మాత్రలతో సరిపెట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల టెన్షన్ తలనొప్పి వస్తుందని వివరించారు. ఈ సమయంలో తలచుట్టూ బిగుతుగా పట్టేసినట్లు, బరువుగా, ఒత్తిడిగా అనిపిస్తుందన్నారు. మైగ్రేన్‌లో తలకు ఒకవైపు లేదా రెండువైపులా తీవ్రమైన నొప్పి రావడంతోపాటు వెలుతురు చూడలేకపోవడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కొందరికి తలనొప్పికి ముందు కళ్లముందు మెరుపులు, వంకర గీతలు కనిపించవచ్చన్నారు.
నిద్ర సరిగా లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, మానసిక ఒత్తిడి, అధిక మద్యపానం, హార్మోన్ల అసమతుల్యత మైగ్రేన్‌కు కారణమవుతాయని తెలిపారు. మైగ్రేన్ చికిత్సలో ఆధునిక వైద్యం ఎంతో పురోగతి సాధించిందన్నారు. రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంప్యూటర్, మొబైల్ వినియోగం మధ్యలో విరామం తీసుకోవడం ద్వారా సాధారణ తలనొప్పులను చాలావరకు నివారించవచ్చని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలే తరచుగా వచ్చే సాధారణ తలనొప్పికి సరైన పరిష్కారమని పేర్కొన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్నవారి సందేహాలను డాక్టర్ సమరం నివృత్తి చేశారు.
