డీఏపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై రైతుల ఆందోళన
ఎంఆర్పీకి రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు
గొల్లపల్లి, ఆంధ్రప్రభ: గొల్లపల్లి మండలంలో డీఏపీ ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు కుమ్మక్కై ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు డీఏపీ ఎరువులు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో సుమారు 15 ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా, అన్ని దుకాణాల్లో డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ అదనపు ధర చెల్లించిన వారికి మాత్రమే విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో డీఏపీ సంచి ఎంఆర్పీని రూ.1,350గా నిర్ణయించగా, గొల్లపల్లిలో ఒక్కో సంచిపై రూ.500 అదనంగా వసూలు చేస్తూ రూ.1,850కు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారం వ్యవసాయ అధికారుల సమక్షంలోనే జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. వరి సాగు పనులు ప్రారంభమైన ఈ సమయంలో డీఏపీ ఎరువులకు భారీ డిమాండ్ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలిపారు.
అధిక ధరల గురించి ప్రశ్నించిన రైతులకు తమ వద్ద డీఏపీ నిల్వలు లేవని చెప్పి పంపిస్తున్నారని, అయితే అదనపు ధర చెల్లించే వారికి మాత్రం ఎరువులు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి డీఏపీ ఎరువులను ఎంఆర్పీ ధరలకే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
