ఎంపీ చిన్నికి కొలికపూడి శుభాకాంక్షలు..

వాట్సప్ స్టేటస్ లో ఎంపీ కి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే
ఏడాదికాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే–ఎంపీ విభేదాలు
గతం లో ఎంపీ చిన్నితో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్న ఎమ్మెల్యే కొలికపూడి
తాజాగా ఎంపీ జన్మదిన శుభాకాంక్షలతో మరోసారి స్టేటస్ పోస్ట్
మారుతున్న రాజకీయ సమీకరణాలపై పార్టీ శ్రేణుల్లో చర్చ
ఇరువురు నేతల మధ్య సయోధ్యకు సంకేతమేనా?


(తిరువూరు, ఆంధ్రప్రభ ) : గత ఏడాదికాలంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ చిన్ని జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం తన వాట్సాప్ స్టేటస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మొన్న ఎంపీ ఫోటో.. నేడు శుభాకాంక్షలు..
మూడు రోజుల క్రితమే ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్త కలిసి ఉన్న ఫొటోను ఎమ్మెల్యే తన వాట్సాప్ స్టేటస్‌గా ఉంచడం కూడా చర్చకు దారితీసింది. తాజాగా జన్మదిన శుభాకాంక్షల స్టేటస్‌తో ఆ పరిణామానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

సంబంధాలు మెరుగుపడుతున్నాయా..
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయా, పార్టీలో సయోధ్యకు సంకేతాలా అనే చర్చ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎంపీ ఎమ్మెల్యేల జరుగుతున్న ఆదిపత్య పోరులో కార్యకర్తలు నాయకులు నలిగిపోతుండడం, రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇద్దరూ మళ్లీ ఒకే స్టేజి పైకి వస్తారా అన్న ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.