వరద ప్రభావిత గ్రామాల్లో ముమ్మర పారిశుద్ధ్య చర్యలు..
ఏలూరు/వేలేరుపాడు/కుక్కునూరు, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. వరద నీరు తగ్గిన అనంతరం అంటువ్యాధులు, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
గణపవరం, అమరవరం, మారేడుబాక, కుక్కునూరు, వేలేరుపాడు, శివకాశీపురం, తోటకూరగొమ్ము, భూదేవిపేట, దాచారం, గొమ్ముగూడెం, రేపాకగొమ్ము, రుద్రంకోట తదితర గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది బ్లీచింగ్ చల్లి, దోమల నివారణ మందులను పిచికారీ చేశారు.

దాచారం, శివకాశీపురంలో ఏర్పాటు చేసిన వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందిస్తూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అదేవిధంగా వరద సహాయక కేంద్రాలు, ప్రభావిత గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది.
