గుడుంబా మత్తుతో గుప్పుమంటున్న పల్లెలు

సరిహద్దుల్లో తయారీ..

గ్రామాల్లో జోరుగా విక్రయాలు

కుబీర్, ఆంధ్రప్రభ : ఒకప్పుడు వేలాది కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతీసిన గుడుంబా మళ్లీ గ్రామాల్లో ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి వస్తుండటంతో పల్లెలు మరోసారి గుడుంబా మత్తుతో గుప్పుమంటున్నాయి. కుబీర్ మండలంలోని పలు గ్రామాలకు సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలపై గుడుంబా సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా వ్యాపారం మళ్లీ విస్తరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రామ శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా బట్టీలు ఏర్పాటు చేసి, కలుషిత నీటితో పాటు కుళ్లిన పండ్లు, కూరగాయలు, బెల్లం, చక్కెర, పటిక తదితర పదార్థాలతో గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం పాల ప్యాకెట్ల మాదిరిగా ప్లాస్టిక్ కవర్లలో నింపి గ్రామాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

రోజంతా కూలీ పనులు ముగించుకుని వచ్చిన నిరుపేదలు తక్కువ ధరకే లభిస్తోందనే కారణంతో గుడుంబాను సేవిస్తూ తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా తయారీ ఎలా జరుగుతుందో తెలియకపోయినా మత్తు కోసం వినియోగించడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు.

ఎక్సైజ్ శాఖ గుడుంబా నియంత్రణలో తగిన నిఘా పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బెల్లం, పటిక వంటి ముడిసరుకులపై నియంత్రణ విధించి, తయారీదారులకు కౌన్సెలింగ్‌తో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం ద్వారా గుడుంబాను అదుపులోకి తీసుకువచ్చిన అధికారులు ప్రస్తుతం అదే స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మండలంలోని తండాల నుంచి గుడుంబా గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గతంలో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ, గుడుంబా వ్యాపారం మాత్రం కొనసాగుతుండటం గమనార్హం. పోలీసుల కళ్లుగప్పి రవాణా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

గుడుంబా తయారీ కేంద్రాలపై దృష్టి సారించకుండా అప్పుడప్పుడు తండాల్లో మాత్రమే దాడులు చేయడం వల్ల అసలు మూలాలను గుర్తించలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. వ్యవసాయ పనుల సీజన్‌ను ఆసరాగా చేసుకుని పంట చేల సమీపంలో రహస్యంగా గుడుంబా తయారీ కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. నడి రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై గుడుంబా తరలిస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరుకుల సరఫరాను అడ్డుకోవడంతో పాటు తయారీ కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేయాలని ప్రజలు కోరుతున్నారు. తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో గుడుంబా దుష్పరిణామాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.