ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ గేమ్‌చేంజర్: కలిశెట్టి

ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం, : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతానికి బహుముఖ ప్రయోజనాలు చేకూరనున్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నావికాదళం ఆధీనంలో ఉండటం వల్ల రాత్రి వేళల్లో ల్యాండింగ్‌లు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర పరిమితులు ఉండేవని పేర్కొన్నారు. భోగాపురంలో 3.8 కిలోమీటర్ల సుదీర్ఘ కోడ్-ఈ రన్‌వే ఏర్పాటు చేయడం వల్ల బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A330 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు నేరుగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

ట్రిపుల్ సిటీ కనెక్టివిటీ

భోగాపురం వ్యూహాత్మకంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్యలో ఉందని, ఇది కేవలం విశాఖకే పరిమితం కాకుండా మూడు జిల్లాల ఆర్థిక కార్యకలాపాలను అనుసంధానించే కేంద్రంగా మారుతుందని అన్నారు.

లాజిస్టిక్స్, ఎగుమతులకు ఊతం

ఏటా 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ద్వారా ప్రాంతీయ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. అరకు కాఫీ, రాజ్మా, శ్రీకాకుళం జీడిపప్పు, విజయనగరం మామిడి పండ్లు, తీర ప్రాంత రొయ్యలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఇది దోహదపడుతుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానిస్తూ 6 లైన్ల జాతీయ రహదారి, బీచ్ కారిడార్ రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీ ఏర్పాటు కానున్నాయని చెప్పారు.

ఏరోసిటీతో కొత్త అవకాశాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టూ 2,200 ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న ఏరోసిటీతో ఆరు ప్రధాన రంగాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయని ఎంపీ తెలిపారు. పరవాడ, పైడిభీమవరం, విశాఖ ఫార్మా క్లస్టర్ల నుంచి వ్యాక్సిన్లు, ప్రాణరక్షక ఔషధాలను ప్రపంచ దేశాలకు వేగంగా ఎగుమతి చేయడంలో ఎయిర్ కార్గో కీలకంగా మారుతుందన్నారు. విమానాల మరమ్మతులు, సర్వీసింగ్ కోసం ప్రత్యేక ఎంఆర్‌వో (MRO) హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువతకు పైలట్, గ్రౌండ్ స్టాఫ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో శిక్షణ లభిస్తుందని చెప్పారు.

ఐటీ, డిఫెన్స్ రంగాలకు ప్రోత్సాహం

ప్రత్యక్ష అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో బెంగళూరు, హైదరాబాద్ తరహాలో గ్లోబల్ కంపెనీలు తమ క్లయింట్ కార్యాలయాలు, ఐటీ డేటా సెంటర్లను వైజాగ్-భోగాపురం కారిడార్‌లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖ సమీపంలోని నావల్ డాక్‌యార్డ్, ఎన్‌ఎస్‌టీఎల్‌ను దృష్టిలో ఉంచుకుని డిఫెన్స్ డ్రోన్లు, ఏరోస్పేస్ విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.

పర్యాటక రంగానికి ఊపు

అరకు, లంబసింగి, బొర్రా గుహలు, అరసవల్లి సూర్యదేవాలయం, శాలిహుండం బౌద్ధ క్షేత్రాలకు విదేశీ పర్యాటకుల రాక పెరిగి, ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు వేగవంతమవుతుందని తెలిపారు. రొయ్యలు, చేపలు వంటి సముద్ర ఉత్పత్తులను కోల్డ్ చైన్ కార్గో హబ్ ద్వారా తక్కువ సమయంలో యూరప్, అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు.

ఉద్యోగాలు, అభివృద్ధికి దోహదం

మొదటి దశలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ, క్యాటరింగ్, రవాణా, హోటల్ రంగాల్లో లభిస్తాయని తెలిపారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ క్లస్టర్ ద్వారా ఏటా సుమారు 9 వేల మంది విద్యార్థులకు శిక్షణ అందుతుందని పేర్కొన్నారు.

విశాఖ నగరం భోగాపురం వైపు విస్తరించడంతో ఆనందపురం, తగరపువలస, భోగాపురం ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, విజయనగరం జిల్లాలో భూముల విలువ పెరగడంతో పాటు వాణిజ్య సముదాయాలు ఏర్పడి ప్రాంత రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి హైదరాబాద్, ముంబై, గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికులు, ఇంజినీర్లకు సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించి ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.