CWG 2026 | బాక్సింగ్ రింగ్‌లో భారత్ హవా
- ఒక్కరోజే ఐదు స్వర్ణాలు.. బాక్సర్ల పంచ్‌కు ప్రత్యర్థులు చిత్తు
- 34 పతకాలతో నాలుగో స్థానానికి భారత్..
ఆంధ్రప్రభ : కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. శనివారం జరిగిన ఫైనల్స్‌లో భారత బాక్సర్లు… తమ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఐదు స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒక్కరోజే ఐదు బంగారు పతకాలు సాధించడం భారత బాక్సింగ్ చరిత్రలో మరో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ విజయాలతో భారత్ మొత్తం 34 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
మహిళల విభాగంలో భారత బాక్సర్లు అద్భుత ఆధిపత్యం ప్రదర్శించారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోను 5-0తో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. 51 కేజీల్లో సాక్షి చౌదరి ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను అదే 5-0 తేడాతో చిత్తు చేసింది.
57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా అనుభవజ్ఞురాలైన మైఖేలా వాల్ష్‌పై ఏకపక్షంగా 5-0తో గెలిచి మరో బంగారు పతకాన్ని భారత్‌కు అందించింది. 60 కేజీల్లో ప్రియ గంగాస్ కెనడా బాక్సర్ మేరీ-బతౌల్ అల్-అహ్మదియెపై 4-1తో విజయం సాధించగా, 70 కేజీల్లో అరుంధతి చౌదరి ఇంగ్లండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌ను 5-0తో ఓడించి భారత్‌కు ఐదో స్వర్ణాన్ని అందించింది.
పురుషుల 55 కేజీల ఫైనల్లో జాదుమణి సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్‌తో తలపడ్డాడు. గట్టి పోరాటం చేసినప్పటికీ 0-5తో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
భారత్ పతకాల వేట ఇంకా ముగియలేదు. లవ్లీనా బోర్గొహైన్, సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్, నరేందర్ బెర్వాల్ ఇంకా ఫైనల్స్‌లో బరిలోకి దిగాల్సి ఉంది. వీరంతా కూడా స్వర్ణ పతకాల ఫేవరెట్లుగా ఉండటంతో భారత ఖాతాలో మరిన్ని బంగారు పతకాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్లాస్గోలో భారత బాక్సర్లు ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో బాక్సింగ్ భారత పతకాల వేటలో ప్రధాన ఆయుధంగా మారిందనే చెప్పాలి. మహిళా బాక్సర్ల అద్భుత ప్రదర్శనతో పాటు యువ బాక్సర్ల ధైర్యమైన పోరాటం భారత బాక్సింగ్ భవిష్యత్తుపై మరింత ఆశలు పెంచుతోంది.
