పేద‌ల సామాజిక భ‌ద్ర‌త‌కు ఎన్‌టీఆర్ భ‌రోసా..

  • అర్హుల ఇంటికే ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లాలు
  • జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు రూ. 98.12 కోట్లు
  • పెన్ష‌న్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యుడు గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు

( విజయవాడ, ఆంధ్రప్రభ) : స్వ‌ర్ణాంధ్ర‌, వికసిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌కు అనుగుణంగా పేద‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల ఫ‌లాల‌ను అర్హుల ఇంటివ‌ద్ద‌కే అందిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యుడు గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు అన్నారు. శ‌నివారం ఆటోన‌గ‌ర్ స‌మీపంలోని జేడీ న‌గ‌ర్‌లో జ‌రిగిన ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ లక్ష్మీశ‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల‌తో ఆప్యాయంగా మాట్లాడి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం అమ‌ల్లో అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నానికి ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు తెలిపారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌న్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 2,24,793 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 98.12 కోట్లు మేర పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. వ‌యోవృద్ధులు, విభిన్న ప్ర‌తిభావంతులు, ఇత‌ర లబ్ధిదారుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఇంటిద‌గ్గ‌రే పెన్ష‌న్లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. పంపిణీ స‌మ‌యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా అధికారులు క్షేత్ర‌స్థాయిలో నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.