“టెట్ “పరీక్ష ను కట్టుదిట్టంగా నిర్వహించాలి..

  • ఆగస్టు 5 నుండి 16 వరకు 11 రోజులు టెట్ పరీక్ష
  • ఆలస్యంగా వస్తే అనుమతించరు..
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

కర్నూలు, ఆంధ్రప్రభ : ఈ నెల 5వ తారీకున నుండి 16 వరకు టెట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి లోపాలు లేకుండా కట్టు దిట్టంగా జరిపించాలని సమావేశంలో అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో టెట్ పరీక్ష ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల 5వ తారీఖు నుండి టెట్ పరీక్షను 11 రోజుల పాటు కట్టుదిట్టంగా,ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పరీక్ష వ్రాసే విద్యార్థులకు పరీక్ష హాల్ లో మంచి వాతావరణం, పరిశుభ్రమైన గాలి , వెలుతురు తో ఉండాలని, శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

టెట్ పరీక్ష 11 రోజుల పాటు రెండు విడతలుగా ఉదయం 9-30 నుండి 12-00 వరకు మరియు మధ్యాహ్నం 2-30నుండి 5 గంటల వరకు జరుగుతుందని , విద్యార్థులు అందరూ అటెండెన్స్ వేయించుకొని మరియు అన్ని తనిఖీలు చేయించుకుని నిర్దేశించిన సమయం ఉదయం 8-30 గంటల నుండి మరియు మధ్యాహ్నం 1-30 గంటల నుండి పరీక్ష హాలు లోకి చేరుకోవాలని ఆలస్యం గా వచ్చే వారిని అనుమతించరని , పరీక్ష హాలులోకి ఎవరు కూడా సెల్ ఫోన్లు , ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని రాకూడదని వాటిని బయటనే పెట్టి రావాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా గట్టిగా నిఘా ఉండాలని డీఈఓ ను ఆదేశించారు

ఈ పరీక్షల కు ప్రతి రోజు కరెంటు సరఫరా నిరంతరాయంగా కొనసాగాలని అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాన్స్కకో అధికారులను ఆదేశించారు. ప్రతి సెంటర్ లో ఏ ఎన్ ఎం ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అవసరం మేరకు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచుకోవాలని , నడవలేని అన్యదా సమర్ధులైన విద్యార్థులకు వీల్ చైర్స్ సౌకర్యం అవసరం మేరకు కల్పించాలని , సంబంధిత డాక్టర్ల ఫోన్ నెంబర్లు సూపరింటెండెంట్లకు తెలియజేయాలని డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ భాస్కర్ ను ఆదేశించారు.

మొత్తం 31,773 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా లో 05 కేంద్రాలలో, హైదరాబాద్ లో 02 కేంద్రాలలో పరీక్ష రాస్తారని తెలిపారు. అవసరం మేరకు పరీక్షా కేంద్రాలు కర్నూలు మరియు ఆదోని లలో ఉదయం నుండి ఆర్టీసీ బస్టాండ్ నుండి ” టెట్ పరీక్ష స్పెషల్ ” బస్సు గా పేరు పెట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ని ఆదేశించారు.

ఈ సమావేశానికి డీఈవో సుధాకర్ , ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లోకరాజు, డెప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ భాస్కర్, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఖాజా హుస్సేన్, ఎం ఈ ఓ లు ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ శ్రీధర్ బాబు, రాజేంద్రప్రసాద్, రమాదేవి, నజీర్ భాష లు, సూపరిండెంట్ లు, పరీక్ష కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు.