అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం..
తల్లి, శిశువు క్షేమం
సమయస్ఫూర్తితో ప్రసవం చేసిన 108 సిబ్బంది.. అభినందనలు వెల్లువ
పరకాల, ఆంధ్రప్రభ: పరకాలలో ఓ గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం జరగగా, తల్లి, మగశిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండేల స్వర్ణలతకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హనుమకొండకు తరలించేందుకు 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
హనుమకొండకు తరలిస్తున్న సమయంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోని ఈఎంటీ భాస్కర్, పైలట్ అర్జున్ సమయస్ఫూర్తితో ప్రసవం చేయించారు. దీంతో స్వర్ణలత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును సురక్షితంగా ఆసుపత్రికి తరలించగా, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
పరకాల పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆరోపించారు.
మార్గమధ్యలో గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేయించిన 108 సిబ్బంది భాస్కర్, అర్జున్ను స్థానికులు అభినందించారు.
