వర్షాకాలంలో పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్ కోయ శ్రీహర్ష

పరిశుభ్రత, భద్రతకు ప్రాధాన్యం.. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎస్)లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

వర్షాల కారణంగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు, తేళ్లు, దోమలు, ఈగలు వంటి వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

అన్ని తరగతి గదులు, వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షించి, విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు.

మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ పనితీరును మెరుగుపరుచుకుని నాణ్యమైన బోధన అందించాలని పేర్కొన్నారు.

ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, ఆరోగ్యం, భద్రత, క్రమశిక్షణ అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ తమ విద్యాసంస్థలో ఈ అంశాలన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఈఓ శారద, జీసీడీఓ కవిత, మల్లేశం, సంబంధిత శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.