స్కీం వర్కర్లు ప్రభుత్వానికి బానిసలు కారు: సీఐటీయూ
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : స్కీం వర్కర్లంటే ప్రభుత్వానికి బానిసలు కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు అన్నారు. శుక్రవారం స్కీం వర్కర్లు కనీస వేతనాల కోసం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడి, ఆశ, ఐకెపి, మిడ్ డే మీల్ కార్మికులు సమస్యలు చెప్పుకుందామని వస్తే ఉన్నత అధికారులు లేకపోవడం దారుణమని అన్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ప్రతి చిన్న విషయానికి స్కీము వర్కర్లపై ప్రతాపం చూపించే ఉన్నతాధికారులు సమస్యలు చెప్పుకుందామని వచ్చిన స్కీం వర్కర్లను పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు.
సభలు పర్యటనలు, ఎలక్షన్ డ్యూటీలు సంబంధం లేకపోయినా అన్నిటికీ స్కీం వర్కర్లతో ముడిపెట్టి, భయపెట్టి, వెట్టి చేయిస్తున్నారని అన్నారు. ఇది ఎంతో కాలం సాగదని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. తక్షణమే స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ నాయకురాలు డి కళ్యాణి, అంగన్వాడి నాయకురాలు ఎండి హసీనా ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ లక్ష్మి ఐకెపి నాయకురాలు గోవిందమ్మ మాట్లాడుతూ.. ఒక్కొక్కరిగా వచ్చి సమస్యలు జిల్లా అధికారులకు తెలియపరిచామని ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. అందుకునే అందరం కలిసి వచ్చామని కానీ ప్రభుత్వం పారిపోయిందని అన్నారు.

అభివృద్ధి పేరుతో ఊక దంపుడు ఉపన్యాసాలు చెబుతున్న పాలకులు మా సమస్యలను సమస్యలుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కానప్పటికీ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు చర్యలు తీసుకోండి అంటే పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. మీరు పారిపోవడం కాదు పరిస్థితి ఇలాగే కొనసాగితే మేము ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లోకి భారీ కాడ్లను తోసుకొని కలెక్టరేట్ గేటు వద్దకు వెళ్లారు. అధికారులు వచ్చేవరకు కదిలేది లేదని కూర్చున్నారు.
కనీస వేతనం 26000 ఇవ్వాలని, అంగన్వాడీలు నవచేతన యాప్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆశ వర్కర్లు అదనపు డ్యూటీలు పని ప్రదేశాలలో సౌకర్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐకెపి తీవ్రమైన పని ఒత్తిడి వేధింపులకు గురవుతున్నారని మిడ్ డే మీల్ కార్మికులు ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇచ్చే బత్యం సరిపోవట్లేదని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా నాయకులు పివి ప్రతాప్, ఎం ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళలను గౌరవిస్తాం, పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం అని పాలకులు వల్లిస్తున్న మాటలు ఈరోజు నడిరోడ్డు మీద మహిళలని కూర్చోబెట్టిన వైనం చూస్తే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

ప్రజల కోసం పెట్టిన స్కీములు వాటిలో పనిచేస్తున్న వర్కర్లు ఇట్లాంటి దీనావస్థలో ఉండడం ప్రభుత్వానికి అవమానం కాద అని ప్రశ్నించారు. పదవులు, అధికారం, ఓట్లు మీద ఉన్న మమకారం ఓట్లు వేసిన ప్రజలపై చూపించకపోతే ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చే పరిస్థితిలో లేరని పోలీస్ అధికారులు చెప్పడంతో డిఆర్ఓ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు వచ్చి సమస్యలు విని వినతి పత్రాలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఆయా డిపార్ట్మెంట్ల అధికారులతో జాయింట్ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ రంగారావు, ఎస్ వెంకటేశ్వరరావు, ఇంజట్ శ్రీనివాస్, ఎం వైకుంఠ రావు, లారెన్స్ కుమారి, వరలక్ష్మి, మహాలక్ష్మి, నాగమణి, డి వరలక్ష్మి, నాగరత్నం, పింకీ అప్పారావు, ఎం పెంటారావు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
