లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం: న్యాయమూర్తి వాసంతి
నర్సాపురం, జూలై 4 (ఆంధ్రప్రభ): జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు అధికారులు న్యాయవ్యవస్థకు పూర్తి సహకారం అందించాలని నర్సాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ. వాసంతి సూచించారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ నెల 11న నర్సాపురం కోర్టు సముదాయంలో రెండో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ప్రాధాన్యతను కక్షిదారులకు వివరించి అవగాహన కల్పించాలని, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ప్రతి పోలీసు అధికారి కృషి చేయాలని సూచించారు. నరసాపురం, పాలకొల్లు కోర్టుల పరిధిలోని క్రిమినల్ కేసులను రాజీ దిశగా తీసుకెళ్లాలని, నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం. సుధాకరరావు, పాలకొల్లు పట్టణ, గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, కోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.
