ప్రతి అర్జీకి అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
- వారం రోజుల్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
- ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 73 అర్జీలు
నరసాపురం, ఆంధ్రప్రభ: నరసాపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ప్రజల నుంచి మొత్తం 73 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆర్డీవో దాసిరాజుతో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఒక్కరోజే 73 అర్జీలు స్వీకరించామని, వాటిలో చిన్నచిన్న సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
డ్రైనేజీ, ఇరిగేషన్ కాలువల ఆక్రమణలు, తాగునీటి సమస్యలు వంటి ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రజలకు మరింత చేరువ కావాలని, పరిష్కారం సాధ్యం కాని అంశాలపై కూడా అర్జీదారులకు స్పష్టమైన కారణాలను తెలియజేయాలని అన్నారు.
ఇప్పటివరకు జిల్లాలో 6,975 అర్జీలు స్వీకరించగా, వాటిలో 5,733 సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ప్రతి అర్జీకి అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, నిబంధనలకు లోబడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీకి అధికారులు పరిష్కార మార్గం చూపాలని సూచించారు. నరసాపురం నియోజకవర్గంలో ఇదే తరహా ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కూడా అర్జీల రూపంలో సమర్పించాలని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
అందిన ప్రధాన ఫిర్యాదులు..
- నరసాపురం మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన తిరుమాని కనకదుర్గ తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
- నరసాపురం మెయిన్ కెనాల్, వేములదీవి పంట కాలువల్లో డ్రైనేజీ నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.
- నరసాపురం మండలం రుస్తుంబాధ నత్తలవా మురుగు కాలువ ఆక్రమణలకు గురవడంతో సుమారు 650 ఎకరాల పంట భూమి ముంపునకు గురవుతోందని, వెంటనే ఆక్రమణలు తొలగించి కాలువను ఆధునీకరించాలని ఎర్రంశెట్టి వారిపాలెం గ్రామానికి చెందిన కునపరెడ్డి వీర వెంకట విజయరామారావు విజ్ఞప్తి చేశారు.
- నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో 40 ఏళ్ల క్రితం వేసిన పైప్లైన్లు శిథిలావస్థకు చేరడంతో తాగునీరు కలుషితమవుతోందని, కొత్త పైప్లైన్లు వేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామస్థులు కోరారు.
- నరసాపురం మండలం ఎల్.బి.చర్ల గ్రామానికి చెందిన 39 ఏళ్ల గుత్తుల రాజేశ్వరి, తాను మానసిక వికలాంగురాలినని, వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా ప్రత్యేక అధికారి వై. దోసిరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి. వీరభద్రరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్. రామిరెడ్డి, నరసాపురం తహసీల్దార్ నాగార్జున, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
