వచ్చే వారం సోలార్ ప్లాంట్ ప్రారంభం
ఖిలా వనపర్తి ప్లాంట్ పనులు వెంటనే పూర్తి చేయాలి
ఎలిగేడులో 15 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం వేగవంతం చేయాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ధర్మారం మండలంలోని ఖిలా వనపర్తి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సోలార్ ప్లాంట్‌ను వచ్చే వారం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖిలా వనపర్తి గ్రామంలోని సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి, ప్లాంట్‌ను వచ్చే వారం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎలిగేడు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోదాం నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్లు పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఆధునిక నిల్వ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా గోదాం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనుల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి (డీసీఓ) శ్రీమాల, ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎలిగేడు తహసీల్దార్ యాకన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
