కూటమి పాలనలో నష్టపోతున్న రైతాంగం..
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
- పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు వైసీపీ వినతిపత్రం
- మినుము రైతులకు పంట బీమా, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్
- పత్తి, మిర్చి పంటల బీమా గడువు పొడిగించాలని విజ్ఞప్తి
- రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని వెల్లడి
విజయవాడ, ఆంధ్రప్రభ : “రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఏకైక వర్గం రైతాంగమే. మినుము రైతులకు రావాల్సిన పంట బీమా పరిహారాన్ని వెంటనే అందించి, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలి” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని నల్లూరివారి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషాకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నందిగామ నియోజకవర్గంలోని మినుము రైతులకు రావాల్సిన పంట బీమా పరిహారం, ఇతర పంటల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అవినాష్ తెలిపారు.
రాష్ట్రంలో మిర్చి, వరి, మినుము, పొగాకు, పత్తి సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. మినుము రైతులకు తక్షణమే పంట బీమా సౌకర్యం కల్పించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరామని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గంలో సుమారు 3,500 హెక్టార్లలో మినుము సాగు జరుగుతున్నప్పటికీ పంట బీమా జాబితాలో మినుమును చేర్చకపోవడం రైతులకు అన్యాయమని ఆరోపించారు.
పెసర వంటి పంటలకు బీమా కల్పిస్తూ మినుమును విస్మరించడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మినుము పంటకు బీమాతో పాటు నష్టపరిహారం కూడా అందించామని గుర్తు చేశారు. డీజిల్, ఎరువుల ధరలు పెరగడంతో సాగు వ్యయం అధికమైందని, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దెబ్బతిన్న ప్రతి ఎకరానికి ఈ-క్రాప్ నమోదు చేసి రైతులకు ఉచిత పంట బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పత్తి, మిర్చి పంటలు అధికంగా సాగు చేస్తున్న రైతులు బీమా గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు.
జిల్లాలో సుమారు 30 శాతం మంది పత్తి రైతులు ఇంకా పంట బీమా నమోదు చేసుకోలేదని, వారికి మరో 15 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. మిర్చి పంట ఇంకా నారు దశలోనే ఉండటంతో ఈ-క్రాప్ నమోదు కాకుండానే బీమా గడువు ముగించడం సమంజసం కాదని, మిర్చి పంట బీమా నమోదు గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే, నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
