పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ వీడ్కోలు

నర్సంపేట, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరి వీడ్కోలు పలికేందుకు నర్సంపేట పట్టణం జనసంద్రంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిని కడసారి చూసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సంపేటకు చేరుకున్నారు. అంతిమయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ శ్రేణులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అభిమాన ఉద్యమ నాయకుడి మృతితో నర్సంపేట నియోజకవర్గం విషాదంలో మునిగిపోయింది. అంతిమయాత్ర సాగిన మార్గమంతా ప్రజలు బారులు తీరి నిలబడి పూలమాలలు సమర్పిస్తూ తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది అమర్ హై, జై తెలంగాణ నినాదాలతో నర్సంపేట మార్మోగింది.