అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రతినిధులను అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో సీఐటీయూ నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు నిరసనకారులను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, అసంఘటిత రంగ కార్మికులు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కనీస గౌరవ వేతనం అమలు చేయడం లేదని ఆరోపించారు. గౌరవ వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఆగస్టు 15న “చలో విజయవాడ” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఐటీయూ నేతలు ప్రకటించారు.
