కొత్త ఇళ్లకు సోక్‌పిట్ తప్పనిసరి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఇంకుడు గుంత లేకుంటే ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ లేదు
ప్రతి వార్డులో నెల రోజుల్లో కనీసం 30 ఇంకుడు గుంతల లక్ష్యం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత (సోక్‌పిట్) ఏర్పాటు తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇకపై కొత్తగా నిర్మించే ఇళ్లలో సోక్‌పిట్ లేకుంటే ఇంటి నంబర్‌తో పాటు తాగునీటి నల్లా కనెక్షన్ కూడా మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన పట్టణ పరిపాలన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
జల శక్తి జన భాగిదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో కూడా సాధ్యమైనంత మేర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రతి వార్డులో నెల రోజుల్లో కనీసం 30 సోక్పిట్లు నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తప్పనిసరిగా సోక్పిట్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కాలానుగుణ వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని, రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంతో పాటు తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ఆకుల వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
