నేర నియంత్రణలో సాంకేతికతే కీలకం

నేర నియంత్రణలో సాంకేతికతే కీలకం

గడువులోగా కేసుల దర్యాప్తు పూర్తి చేయాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి కేసు దర్యాప్తును పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.

మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మే నెలకు సంబంధించిన నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీపీ, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాత కేసుల్లో అవసరమైతే న్యాయ సలహా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్‌డీపీఎస్ కేసులు వంటి కీలక అంశాలను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని, విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వవద్దని హెచ్చరించారు. సమాచార సేకరణలో అధికారులు ముందుండాలని, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

సీసీటీఎన్‌ఎస్ సిబ్బందితో మాట్లాడుతూ, సాంకేతిక వ్యవస్థల వినియోగం ద్వారా నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు. సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య వ్యవస్థలను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply