తలసేమియా బాధితులకు పెన్షన్ అమలు హర్షణీయం: ఈవీ శ్రీనివాస్ రావు

హనుమకొండ, ఆంధ్రప్రభ: తలసేమియా, సికిల్ సెల్ బాధితుల సంక్షేమం కోసం 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలుకు నోచుకోని పెన్షన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించడం హర్షణీయమని ఐఆర్‌సీఎస్ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాస్ రావు శుక్రవారం పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. పెన్షన్ అమలు నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు.