1000s of years |సమ్మక్క–సారలమ్మల కంటే ముందే మేడారం..
1000s of years | దండకారణ్యంలో భాగమైన మేడారం
రామాయణ కాలంలో దండకారణ్యం ప్రస్తావన
వనదేవతల ఆరాధన – మేడారం మూలరూపం
పురాణ గ్రంథాల్లో మేడారం ప్రస్తావన ఉందా?
సమ్మక్క–సారలమ్మల వీరగాథ: చరిత్ర–పురాణాల సంగమం
ఆదివాసీ సంస్కృతికి కేంద్రంగా మేడారం
గ్రంథాల్లో కాదు… ప్రజల హృదయాల్లో…
1000s of years | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన సంస్కృతికి ప్రతీకగా జరిగే జాతర మేడారం. సమ్మక్క–సారలమ్మ జాతరకు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తారు భక్తజనం. తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే సమ్మక్క, సారలమ్మల వీరగాథకు ముందే మేడారం ప్రాంతానికి పురాణాత్మక నేపథ్యం ఉందా అని అంటే, ఔనని అంటున్నారు పరిశోధకులు.
కానీ అది రామాయణ–మహాభారతాల్లా స్పష్టమైన గ్రంథ ఆధారాలతో కాదు. ప్రధానంగా వనవాస సంస్కృతి, దండకారణ్య సంప్రదాయాల వారసత్వాల ఆధారాలతో. ఎలాగంటే, మేడారం ప్రాంతం తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని విస్తరించిన దండకారణ్యంలో భాగం. దండకారణ్యం అనే పేరు మనకు పురాణాల నుంచే తెలుసు.

ఎలా తెలుసు? ఎక్కడ దండకారణ్యం గురించి ప్రస్తావించబడింది? అంటే, రామాయణ కాలంలో శ్రీరాముడు వనవాస సమయంలో సంచరించిన అరణ్యాల్లో దండకారణ్యం ఒకటని వాల్మీకి రామాయణంలో ప్రస్తావన ఉంది. ఈ దండకారణ్యంలో మునులు, ఋషులు, యోగులు, ప్రకృతి ఆరాధకులు సంచరించేవారనీ, వనదేవతల పూజలు విస్తృతంగా జరుగుతూండేవని పురాణ గాధల్లో ప్రస్తావించబడింది.
ఇక వనదేవతల ఆరాధన, మేడారం మూలరూపం విషయానికొస్తే, సమ్మక్క–సారలమ్మల కథకు ముందే ఈ ప్రాంతంలో అమ్మవారి ఆరాధన ఒక ప్రకృతి దేవతా రూపంలో ఉండేదని చరిత్రకారుల కథనం. పురాతన కాలంలో చెట్లే దేవతలుగా, గుట్టలే ఆలయాలుగా, వాగులే తీర్థాలుగా, వనదేవతలు, భూదేవతలు, గ్రామదేవతల పూజలు ఆచరించేవారు. మేడారం ప్రాంతంలో ఇప్పటికీ గుట్టలపై చెట్ల కింద రాళ్లకు పూజలు చేయడం ఈ ప్రాచీన వనారాధన సంప్రదాయాకళ్ళకు కట్టిస్తుంది.
అయినప్పటికీ పురాణాల్లో స్పష్టంగా మేడారం అనే పేరుతో పురాణాలు, వేదోపనిషత్తుల్లో, నేరుగా ప్రస్తావనలు గానీ, కథలు గానీ లేవనే చెప్పవచ్చు. కానీ, దండకారణ్యం, గోదావరి పరివాహక అరణ్యాలు, వనదేవతల ఆరాధన వంటివి మాత్రం పురాణాల్లో ప్రస్తావనల్లో ఉన్నాయి. అందుకే మేడారం పురాణ కాలం నాటి వనారాధన వారసత్వ సంప్రదాయంగా కొనియాడబడుతోంది. కాలక్రమంలో సమ్మక్క–సారలమ్మల వీరగాథ అనేది చరిత్ర, పురాణాల సంగమం అని భావిస్తారు. సమ్మక్క, సారలమ్మల కథ కాకతీయుల కాలానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం కలిగిన స్పూర్తిదాయకమైన వీరగాధ.
అయితే, వారిని ప్రజలు దేవతలుగా వనశక్తి ప్రతీకలుగా ధర్మరక్షకులుగా ఆరాధించడం వల్ల సమ్మక్క-సారలమ్మ గాథ పురాణగాధను తలపిస్తుంది. అంటే, మేడారం అనేది ప్రాచీన వనదేవతల ఆరాధన, సమ్మక్క–సారలమ్మల వీరగాథల మేళవింపు ఈ మహాజాతర. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మేడారం అతి ప్రాచీన ఆదివాసీ సంస్కృతికి కేంద్రం. అలాగనడానికి వారసత్వ సంప్రదాయాలు నిదర్శనంగా ఉన్నాయి. తరతరాల చరిత్ర ఉంది ఇదే మేడారం ప్రత్యేకత.
మేడారం అంటే కేవలం సమ్మక్క–సారలమ్మల జాతర మాత్రమే కాదు. అది దండకారణ్యం యొక్క పౌరాణిక నేపథ్యం కలిగిన సంప్రదాయ వారసత్వం, వనదేవతల ప్రాచీన ఆరాధన, ఆదివాసీ జ్ఞాన సంపద, చరిత్ర–పురాణాల సంగమం వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనం. అందుకే మేడారం గ్రంథాల్లో కన్నా ప్రజల హృదయాల్లో ఉన్న పురాణం అని చెప్పవచ్చు.
(ఇది వ్యాసకర్త మేధస్సు, అందుబాటులోని సమాచారం మేరకు అందించబడింది.)
click here to read 1000 above | అరుదైన వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల నిలయం
