వర్షాల ధాటికి దెబ్బతిన్న ఇళ్లు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బాధితుల తరలింపు
ఎడపల్లి, ఆంధ్రప్రభ: గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం రాణాకలాన్ గ్రామంలో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామానికి చెందిన షేక్ వహీదా, మెట్టు సుజాత, ఉచిర్ల లలితల ఇళ్లు దెబ్బతినడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు, గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బాధితులను సురక్షితంగా తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రమాదం తప్పింది.
అదే సమయంలో గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న చెవుల గౌరవ్వ అనే వృద్ధురాలిని కూడా భద్రత దృష్ట్యా ఆమె కుమారుడి ఇంటికి తరలించారు. వర్షాల నేపథ్యంలో గ్రామ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. సమయస్ఫూర్తితో స్పందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రతినిధులను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అలేఖ్య శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఉపసర్పంచ్ రవి, గ్రామ నాయకులు దేవేందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
