పెద్ది మృతి తీరని లోటు

దాస్యం వినయ్ భాస్కర్

తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయం
పెద్ది కుటుంబానికి గులాబీ కుటుంబం అండగా ఉంటుందని హామీ

హనుమకొండ, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి తెలంగాణకు, ఉద్యమ సహచరులకు తీరని లోటని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా నివాళులర్పించారు.

“తెలంగాణ సాధించే వరకు పోరాడుదాం, ఓరుగల్లుకు మంచి చేద్దాం అని కలిసి సంకల్పించాం. కానీ మధ్యలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. ఉద్యమంలో పోలీసులు చేసిన దాడులను ఉద్యమ గుర్తులుగా భావించేవాడివి. కేసులు, జైళ్లు, కోర్టులు మనకు అత్తారిల్లులేనని ధైర్యం చెప్పేవాడివి. కేసీఆర్ సైనికులమని, ఒత్తిడులకు తలొగ్గబోమని చెప్పిన నువ్వు విధికి తలొగ్గడం బాధాకరం” అని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు గులాబీ కుటుంబం ఎల్లప్పుడూ వారికి తోడుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.