జానకంపేట్ వద్ద భారీ గుంతలు.. వాహనదారులకు ముప్పు
ఎడపల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని గాంధీచౌక్ వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు కనిపించకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధన్, నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు ఈ గుంతలు నిత్యం ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రాత్రి ఇదే గుంత వద్ద పోలీసు సిబ్బందికి చెందిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ సూచించారు. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
