పొలం పనుల్లోనే రైతుకు గుండెపోటు.. మృతి

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బొమ్మనవేన సమ్మయ్య (60) గురువారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. సమ్మయ్య అపస్మారక స్థితిలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. సమ్మయ్య ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోగా, సూరారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.