ఆదర్శ గ్రామాల అభివృద్ధికి వేగం పెంచండి
- పీఎంఏజీవై నిధులు సత్వరమే వినియోగించి పనులు పూర్తి చేయాలి
- 84 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
- సోలార్ లైట్లు, అంగన్‌వాడీలు, తాగునీరు, రహదారులపై ప్రత్యేక దృష్టి
- అధికారుల సమన్వయంతో ఆదర్శ గ్రామాల లక్ష్యం సాధించాలి
- కలెక్టర్ డా. లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
విజయవాడ కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల సమగ్రాభివృద్ధే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలో 2018-19 నుంచి 2025-26 వరకు (2021-22 మినహా) ఐదు దఫాలుగా 16 మండలాల్లోని 84 గ్రామాలు ఈ పథకానికి ఎంపికయ్యాయని తెలిపారు.
తొలి దశలో ఎంపికైన 33 గ్రామాలకు రూ.6.05 కోట్లకు పైగా నిధులు మంజూరు కాగా, ఇంకా రూ.4.62 కోట్లకు పైగా వినియోగించాల్సి ఉందన్నారు. రెండో దశలోని 51 గ్రామాల్లో 359 అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఆదర్శ గ్రామాల్లో సోలార్ వీధి దీపాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సాంఘిక సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధి ప్రణాళిక ప్రకారం పనులను వేగంగా పూర్తి చేసి, నిజమైన ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
