ఉధృతంగా గోదావరి..

  • పొంగిపొర్లుతున్న వాగులు..
  • అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం
  • ఆ గ్రామాలకు పడవ ప్రయాణమే దిక్కు

వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది.

పూసూరు గోదావరి వంతెన వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుండగా, పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి 14 మీటర్లకు చేరుకుంది. దీంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

రాకపోకలకు తీవ్ర అంతరాయం

చీకుపల్లి–పెద్ద గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగు వంతెన అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో గత మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాజేడు మండలంలోని సుమారు 25 గ్రామాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రవాణా వ్యవస్థ స్తంభించింది.

ఆ గ్రామాలకు పడవ ప్రయాణమే దిక్కు..

ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో లేకపోవడంతో అధికారులు వాగు వద్ద పడవలను ఏర్పాటు చేశారు. ప్రజలు పడవల ద్వారా వాగు దాటి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారు ఈ పడవలపైనే ఆధారపడుతున్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారు అడిగినంత చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.