వీర్లపల్లిని ముంచెత్తిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వరద నీరు

ఎరువుల కర్మాగారం వ్యర్థ జలాలతో గ్రామంలోకి వరద

బాధిత గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే

గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) కర్మాగారం నుంచి వచ్చిన వ్యర్థ జలాలు వీర్లపల్లి గ్రామాన్ని ముంచెత్తాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కర్మాగారం పరిసరాల్లోని వ్యర్థ జలాలు గ్రామంలోకి చేరి పలు ఇళ్లను జలమయం చేశాయి.

గ్రామంలోని ప్రతి ఇంట్లోకి నీరు చేరడంతో గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు నీటిలో తడిసి నష్టపోయాయి. వర్షపు నీటితో పాటు కర్మాగారం నుంచి వచ్చిన మురుగు నీరు గ్రామంలోకి చేరుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ సమస్యపై గురువారం కార్పొరేటర్ కందుల సతీష్, గ్రామ ప్రతినిధి కొక్కిరాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

కర్మాగారం నుంచి ప్రతిరోజూ వెలువడుతున్న దుర్వాసనతో ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, వర్షాలు కురిసిన ప్రతిసారీ వ్యర్థ జలాలు గ్రామంలోకి చేరి మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్ల ఇళ్లలోని సామగ్రి దెబ్బతింటోందని తెలిపారు.

బాధిత గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ముంపుకు గురైన వీర్లపల్లి గ్రామాన్ని గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. కర్మాగారం ప్రహరీ గోడ దిగువ భాగం నుంచి వ్యర్థ జలాలు గ్రామంలోకి చేరుతున్న తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భరోసా ఇచ్చారు.