ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన “టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్” కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా విదేశీ విద్యా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థి-కేంద్రిత అభ్యాస విధానాలను ప్రతిబింబించే చిత్రాలను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కడి విద్యా వ్యవస్థలోని విశేషాలను తెలుసుకున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిన్‌లాండ్, జర్మనీ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ బోధనా విధానాలు, వినూత్న విద్యా పద్ధతులను అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విదేశీ పర్యటనకు వెళ్లిన ఉపాధ్యాయుల అనుభవాలు తెలంగాణ విద్యా వ్యవస్థకు ఎంతో ఉపయోగపడతాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
