Pawan Kalyan | పవన్ ఘాటు ప్రశ్న

Pawan Kalyan | పవన్ ఘాటు ప్రశ్న

ఇంకెంతకాలం ఆంధ్రవాళ్లను తిడతారు?..

Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణపై తనకున్న అనుబంధాన్ని ప్రశ్నిస్తున్న నాయకులపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇంకెంతకాలం ఆంధ్రవాళ్లను తిడుతూ.. కాలక్షేపం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై తన ప్రేమ రాజకీయాల కోసం కాదని, అది ఎంతోకాలం నుంచే ఉన్న అనుబంధమని స్పష్టం చేశారు.

తాను చెరువును కబ్జా చేశానంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని పవన్ అన్నారు. “నేను నిజంగా అలాంటిదేమైనా చేసి ఉంటే నన్ను ఇక్కడ ఉండనిస్తారా?” అని ప్రశ్నించారు. తెలంగాణలో తనకు అనేక మంది అభిమానులు, స్నేహితులు ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని పవన్ కళ్యాణ్ తెలిపారు. అవసరమైతే ఈ క్షణమే ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల గౌరవం విషయంలో తనకు ఎప్పుడూ గౌరవభావం ఉందని చెప్పారు.

సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంలో మర్రి చెన్నారెడ్డి పాత్రను పవన్ గుర్తుచేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారిని తిడుతూ ఉంటే, వారు ఎక్కడ ఉండాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ అందరిదీ అనే భావనతోనే సినిమా పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందిందని అన్నారు.

గద్దర్‌తో తన అనుబంధాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయానికి వచ్చిన గద్దర్‌కు కారు కొనిచ్చానని ఆయన చెప్పారు. తనకు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అనే భేదాలు తెలియవని, మానవత్వం, కమిట్‌మెంట్ మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

కమిట్‌మెంట్ లేకపోతే కొండగట్టుకు టీటీడీ నిధులు ఎందుకు ఇప్పిస్తామని పవన్ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న సమయంలో ఇవాళ మాట్లాడుతున్న నాయకులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. అప్పట్లో తెలంగాణపై ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు.

తనపై దాడులు, విమర్శలు కొత్తవి కావని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసం నిలబడే సమయంలో ఇలాంటి వాటిని ఎదుర్కోవడం సహజమని పేర్కొన్నారు. తెలంగాణతో తన బంధం కొత్తది కాదని, అది రాజకీయాలకు అతీతమైనదని మరోసారి స్పష్టం చేశారు.