ఇంకుడుగుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంచుదాం
ప్రతి ఇంటా ఇంకుడుగుంత నిర్మించాలని సర్పంచ్ గాండ్ల నిఖీత ప్రశాంత్ పిలుపు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంత నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని చిన్నపొర్ల గ్రామ సర్పంచ్ గాండ్ల నిఖీత ప్రశాంత్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథాగా కాలువల్లోకి వెళ్లకుండా ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి చేరి భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
జలసిరి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇంకుడుగుంతలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో నీటి నిల్వ, సంరక్షణ పనులు చేపట్టడం ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
గ్రామ ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేసి జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడుగుంత నిర్మించుకుని నీటి సంరక్షణకు ఆదర్శంగా నిలవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి రఫీ, వార్డు సభ్యులు బందే నవాజ్, నర్సిములు, నరేందర్, మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
