భారీ వర్షానికి కుప్పకూలిన పెంకుటిల్లు
ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కుటుంబం
పలిమెల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం ఓ పెంకుటిల్లు పూర్తిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన కుటుంబ సభ్యులు ఇంటిని ఖాళీ చేసి సమీపంలోని మరో ఇంటికి వెళ్లడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
గ్రామానికి చెందిన చిలుముల మల్లక్క నివాసముంటున్న పెంకుటిల్లు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. ఇంట్లోని సామగ్రి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.
ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితురాలు చిలుముల మల్లక్క ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వర్షాకాలంలో తలదాచుకునే స్థలం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
