మేరికపూడిలోకి ఆర్టీసీ బస్సుల రాక నిలిపివేత
కండక్టర్‌పై దాడి ఘటనతో నరసరావుపేట డిపో కీలక నిర్ణయం
పల్నాడు, ఆంధ్రప్రభ : నరసరావుపేట–గుంటూరు ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో నరసరావుపేట ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులు మేరికపూడి గ్రామంలోకి వెళ్లకుండా నేరుగా గుంటూరుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు నరసరావుపేట నుంచి బయలుదేరే గుంటూరు సర్వీసులు మేరికపూడి గ్రామంలోకి వెళ్లి అనంతరం గుంటూరుకు చేరుకునేవి. అయితే గురువారం నుంచి ఈ సర్వీసులు మేరికపూడి గ్రామంలోకి ప్రవేశించకుండా నేరుగా గుంటూరుకు వెళ్లనున్నట్లు డిపో అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్ నోటీసు బోర్డుపై ప్రత్యేక ప్రకటనను ప్రదర్శించారు.
బుధవారం మేరికపూడికి చెందిన ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కే క్రమంలో కండక్టర్ పూర్ణచంద్రతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం మేరికపూడి వద్ద కొందరు మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకుని కండక్టర్ పూర్ణచంద్రపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ అధికారులు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యకు పరిష్కారం లభించే వరకు మేరికపూడి గ్రామంలోకి బస్సులను నడపవద్దని తాత్కాలికంగా నిర్ణయించారు. దీంతో మేరికపూడి గ్రామ ప్రయాణికులు తాత్కాలికంగా గ్రామం వెలుపల నుంచి బస్సులను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
